Monday, December 29, 2008

geva interwive

తెలుగు లో విలన్లే లేరు అనుకొంటున్న తరుణం లో విలన్ అన్న పదానికి ప్రతి రూపం లా ఎర్రటి తీక్షణమైన కళ్ళు, హిప్పీ తరహా జుట్టు తో విలక్షణం మైన విలనీ ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకొన్న విలన్ జి.వి. ఇన్నాళ్ళూ విలన్ గా బెదిరించిన ఈ జి.వి. వురఫ్ సుధాకర్ నాయుడు ఇప్పుడు దర్శకుడి గా కూడా తన సత్తా ఏంటో చూపించడానికి హీరో చిత్రం తో మనముందుకు రానున్నాడు. ఈ సందర్భం గా తనతో జరిపిన ఒక చిట్ చాట్ మీకోసం . . . . మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్నారు . . హీరో టైటిల్ పెట్టారు అంటే ఈ చిత్రం సినిమాల గురించా? కానే కాదు. ఈ సినిమాలో హీరో పేరు రాధా కృష్ణ, ఈ సినిమాకి హీరో నే ప్రధానం కాబట్టి రాధాకృష్ణ అనే టైటిల్ ని పెట్టాలి, కానీ అది అంత ఎఫెక్టివ్ గా వుండదని హీరో టైటిల్ ని పెట్టడం జరిగింది. ఐతే ఈ టైటిల్ పెట్టడానికి తగిన రీజన్ కూడా వుంది. ఏంటంటే ప్రతి వ్యక్తీ పుట్టినప్పుడే తాను హీరో అనుకొంటాడు. మనిషి ఎదుగుతున్న కొద్దీ జీవితాన్ని సరదాగా గడపాలీ అనే అనుకొంటాడు. మరి అలాంటి ఒక యువకుడు జీవితం అంటే ఇదే కాదు ఇంకేదో వుందని తెలిస్తే, తనకు తానే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొంటే, దానిని చేజిక్కించుకోవడానికి ఎలా ప్రయత్నించాడూ, దానిని చివరకు సాధించి రియల్ హీరో ఎలా అయ్యాడు అన్నదే ఈ చిత్ర కధ. సొ ఈ హీరో టైటిల్ అయితే చాలా యాప్ట్ గా వుంటుందని భావించి పెట్టడం జరిగింది. ఒక నటుడి గా మీ ప్రస్థానం ఎలా సాగింది? నేను ఇప్పటివరకూ దాదాపు గా నూట యాభై సినిమాలకు పైగానే చేసాను. విలన్ గా అందరినీ భయపెట్టాను. నటుడి గా నన్ను దాదాపు అందరూ ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నేను చేసిన సినిమాలన్నీ బిగ్ హీరోస్ తోనే అది కూడా అన్నీ సక్సస్ లే. సొ నాకు అన్ని రకాలుగా ఇక్కడ మంచి ప్రోత్సాహం వుంది. మరి ఇలా చక్కగా నటుడి గా బిజీ గా వున్న మీరు దర్శకుని గా మారడానికి గల కారణం? చూడండీ . . . మనిషి ఎప్పుడూ ఒక వృత్తినే ప్రేమించాలని లేదు కదా. నాకు సినిమాలన్నా, పాటలన్నా, కార్లన్నా చాలా ఇష్టం. పెళ్ళిఅయిపోయింది కాబట్టి కొన్ని కొన్ని ఇష్టాలను చెప్పకూడదు. ఇక సినిమా విషయానికి వస్తే ఇదొక సముద్రం. ఎన్ని చేసినా క్రియేటివిటీ కి ఇక్కడ ఎప్పుడూ చోటు వుంటుంది. మన ప్రతిభను ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ తగినంత ఫ్రీడం వుంది. నేను ఇంటర్ తర్వాత సైన్స్ తీసుకొన్నా ముందు, అబ్బే ఇది కాదు అని మళ్ళీ ఆర్ట్స్ లోనికి వచ్చాను, తర్వాత ఎల్ ఎల్ బి చేసాను, అందులో మాష్టర్స్ యు ఎస్ లో చేసాను, తర్వాత లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేసాను, ఈ టైమ్ లోనే సినిమాల్లో చేయడం మొదలు పెట్టాను. నాకు ఈ ఫీల్డ్ నచ్చింది. అయితే నటుడి గా నేను చేస్తున్నాప్పుడే ఈ పాత్ర ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సీన్ ఇలా అయితే ఇంకా బా వస్తుంది లాంటి ఆలోచనలు నన్ను తినేసేవి. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు పేపర్ మీద పెట్టుకొనే వాడిని. నేనే దర్శకుడి ని ఐతే ఇలాంటివన్నీ అమలు చేయవచ్చు కదా అన్న ఆలోచన నన్ను ఈ దిశగా నడిపించింది. ఒక రోజు మన్యం రమేష్ గారికి నేను కధ (అది కూడా సరదాగా) చెప్పడం ఆయన వెంటనే మనం చేద్దాం అనడం తో వెయ్య ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. ఇక నితిన్ కి కూడా కధ వినిపించగానే వెంటనే ఒప్పుకోవడం తో ఈ హీరో మొదలయ్యింది. కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఈ సినిమా ఓ కే అయ్యింది. మీరు విలన్ గా నే ఎక్కువ పాత్రలు చేసారు . . మరి ఆ పాత్రల ప్రభావం మీ సినిమా మీద ఎంత వరకూ వుంటుంది? అవును నేను చేసిన వన్నీ విలన్ పాత్రలే కాబట్టి నా సినిమా కూడా ఫుల్లు వయొలెంట్ గా వుంటుందనుకొంటారు. నానుండి అదే ఆశిస్తారు. అయితే ప్రేక్షకులను భయపెట్టో, రక్తపాతాలు, నరుక్కోడాలూ చూపించో తీస్తే అది సినిమానే కాదు అని నా పర్సనల్ అభిప్రాయం. నిజానికి అటువంటి వాటి కోసం బోలెడన్ని ఛానళ్ళు వున్నాయి. నా దృష్టి లో సినిమా అంటే వినోదం. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. చేసింది విలన్ పాత్రలే అయినా నాలో కొంచం హాస్యం పాళ్ళు ఎక్కువ. కన్నీళ్ళు కష్టాలు నా సినిమాలో వుండవు. ధియేటర్ కి వచ్చి టికెట్ కొనుక్కొని సినిమా చూసేవారు హాయిగా రెండు గంటల పాటు నవ్వుకోగలిగితేనే ఆ సినిమా సక్సస్ అవుతుంది. నా సినిమా అలా వుంటుంది. వుంటారు విలన్లూ వుంటారు ఫైట్లూ వుంటాయి కానీ ఏదీ ప్రేక్షకులను భయపెట్టేలా వుండదు. హీరోయిన్ గా భావన ను తీసుకోవడం వెనుక ప్రత్యేకమైన కారణం వుందా . . . ఈ చిత్రం లో హీరోయిన్ పాత్రకు పలు రకాలు గా వుంటుంది. అంటే చాలా వేరియేషన్స్ వున్న క్యారెక్టర్. నాకు తెలిసి భావన చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. ఎన్ని వేరియేషన్స్ అన్న ఇట్టే చేయగలదు అని నేను నమ్మాను. ఆమె ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు కూడా. నాకు బాగా ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు. ఆమె లేని లోటు ని భావన తీరుస్తుందన్న నమ్మకం నాకుంది. ఇంతకీ ఈ సినిమాకి విలన్ మీరేనా మరి . . . కాదు కాదు. నేను ఈ మూవీ లో అసలు నటించనే లేదు. కోట శ్రీనివాసరావు గారు మనకున్న అతికొద్దిమంది అద్బుతమైన పెర్ఫార్మర్ లలో ఒకరు. ఈ చిత్రం లోని నెగిటివ్ రోల్ ని ఆయనే చేసారు. అయితే మరి మన యంగ్ హీరోకి కూడా ఒక యంగ్ ప్రత్యర్ధి వుండాలి కాబట్టి ఈ చిత్రం ద్వారా ఒక కొత్త విలన్ ని కూడా పరిచయం చేస్తున్నాను. మొదటి సారి చేస్తున్నాను కాబట్టి నా దృష్టి అంతా దర్శకత్వం మీదనే కేంద్రీకరించాలనే ఇందులో నేనేం క్యారెక్టర్ చేయలేదు. అంతెందుకు డైరెక్టర్ సుధాకర్ నాయుడు ఈ మూవీ లో జి.వి కి క్యారెక్టర్ ఇవ్వలేదనుకోండి (నవ్వుతూ) మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడి గా బిజీ అయిపోతారేమో, ఇక అప్పుడు నటన కు బై బై చెప్పేస్తారా . . . కలలో కూడా అది జరగని పని. ఈ సినిమా నాకు దర్శకుడి గా చాలా మంచి పేరు తెస్తుంది. ఆ నమ్మకం నాకుంది, దర్శకుడి గా కూడా నాకు మంచి ఆఫర్లే వస్తాయి, అయినా నాకంటూ ఒక గుర్తింపు నిచ్చిన నటన ను ఎలా వదులు కొంటాను. అయితే అవకాశాలను బట్టీ ప్రిఫరెన్సు లు మార్చుకొంటాను. నటించడం తగ్గుతుందేమో గానీ తప్పుకోవడం మాత్రం వుండదు. దర్శకుడి గా మీకు ఎటువంటి అనుభవమూ లేదు కదా, మరి ఈ షాట్ మేకింగ్ మీద గానీ కెమెరా మీద గానీ మీకు అవగాహన ఎలా వచ్చింది. నేను నటుడి గా చేస్తున్నప్పుడే నేను అన్నీ గమనించే వాడిని. అక్కడ పని చేసే డైరెక్టర్లనీ, కెమెరా మేన్ లనీ అడిగి తెలుసుకొంటూ వుండే వాడిని ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయకూడదు లాంటి ప్రశ్నలతో వాళ్ళని వేధించుకు తినేవాడిని. అవన్ని నాకు ఇప్పుడు బాగా హెల్ప్ అయ్యాయి. ఇక కొంత ధియొరిటికల్ నాలెడ్జ్ ని పుస్తకాలు చదివి తెలుసుకొన్నాను. నటుడి గా గానీ దర్శకుడి గా గానీ మిమ్మల్ని మీరు ఎలా అప్ డేట్ చేసుకొంటూ వుంటారు . . . నేను చాలా సినిమాలు చూస్తూ వుంటాను, ప్రతి వ్యక్తి నీ నిశితం గా గమనిస్తూ వుంటాను, తెలియని విషయాలను ఇంటర్నెట్ మాద్యమాల ద్వారా తెలుసుకొంటూ వుంటాను. నేర్చుకొవాలన్న తపన వున్న ప్రతి వ్యక్తీ ఆటోమాటిక్ గా ప్రస్తుత పరిస్తితులకు తగినట్లు గా అప్ డేట్ అయిపోతాడు.

No comments:

Post a Comment

Your Ad Here
Your Ad Here

About Me

hyderabad, telangana, India
main event to say friends about prajayam